19, ఏప్రిల్ 2022, మంగళవారం

ఏలూరు జూట్ కార్మికోద్యమ నేతకు నివాళి



 *ఏలూరు జూట్ కార్మికోద్యమంలో 35 ఏళ్ల క్రితం ఓ అపురూప పాత్ర పోషించిన బుడుమూరు నాగేశ్వరరావు మృతి* 


*కార్మికోద్యమాల్ని కీలక మలుపులు తిప్పే ఘటనల పరిశీలనకు  ఆయనో ఉదాహరణ!


మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. శ్రమ జీవులే చరిత్ర సృష్టిస్తారు. ఇవి నిప్పులాంటి నిజాలే!  కార్మికోద్యమాల నుండి యోధులు పుట్టుకొస్తారు. ముఖ్యంగా కొన్ని కీలక సంఘటనలకు కొందరు కారకులై స్ఫూర్తిదాతలు గా, ప్రేరణగా నిలుస్తారు. అలాంటి నిర్దిష్ట ఉజ్వల సంఘటనకు ముందూ, వెనకా ఆ నిర్దిష్ట వ్యక్తులు సామాన్యులుగానే వుంటారు. వారే కొన్ని వేళల్లో అసామాన్యుల పాత్రల్ని పోషిస్తుంటారు. తాత్కాలికంగా వారు అసమాన్య పాత్ర పోషించి ఉద్యమ గమనానికి ఒక నిర్దిష్ట దశలో తోపుడు శక్తిగా కూడా నిలుస్తారు. ఏలూరు జూట్ కార్మికోద్యమ గమనంలో 35 ఏళ్ల క్రితం అలాంటి ఓ తోపుడు శక్తి పాత్రను బుడుమూరు నాగేశ్వర రావు పోషించాడు. తాను ఏలూరులో నిన్న మృతి చెందాడు. ఆయన నాడు పోషించిన ఆ పాత్రని గుర్తు చేసుకోవడానికి సముచిత సందర్భమిది. 


  ఫ్లాష్ బ్యాక్


 అది 1986 మే ఒకటి! నూరవ మే దినోత్సవం రోజు! ఇఫ్టూ బహిరంగ సభ! ఏలూరు జూట్ మిల్ లో పురుష కార్మికులకు 8 గంటల పనిదినం, కానీ మహిళా కార్మికులకు 12 గంటల పనిదినం అమలు జరిగేది. నాటి సభ 8 గంటల పనిదినం కై మేడే పోరాటం జరిగి నూరేళ్ళకి కూడా ఈ అన్యాయం ఏమిటని ప్రశ్నించింది. పైగా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గల ఏలూరులో ఇదేమి దురన్యాయమని ఆనాటి సభలో ప్రశ్నించిన వాణి జూట్ మిల్ మహిళా కార్మికుల హృదయాల్ని తాకింది. అంతవరకూ అణచబడి ఒదిగివున్న  మహిళ కార్మికుల్లో కొత్త చైతన్యం తలెత్తింది. అదో దీర్ఘకాలిక సజీవ ఉద్యమ రూపం ధరించింది. అదో పూర్వరంగ నేపధ్యం! 


   180 మంది మహిళా కార్మికుల కోసం 5000 మంది పురుష కార్మికుల్ని సంఘీభావంగా సమీకరణ చేయాల్సిన బాధ్యత ఇఫ్టూ సంఘంపై పడింది. అది చాలా క్లిష్టమైనది. పైగా సున్నితమైనది కూడా! పిడికెడు మంది ఆడవాళ్ళ కోసం ఐదు వేల మంది మగవర్కర్లని రోడ్డు పాలు చేస్తున్నారనే నిందా ప్రచారానికి జూట్ యాజమాన్యం & వారి అనుకూల సంఘాలు పాల్పడ్డాయి. మహిళల్ని అవహేళన చేసే భాషలో దుష్ప్రచారం సాగించడం గమనార్హం! ఆడవారికి వ్యతిరేకంగా పురుష కార్మికుల్లో పురుష దురహంకారాన్ని రెచ్చగొట్టే ప్రచారమది. ఆ సున్నిత పరిస్థితుల్లో ఐదు శాతం మంది మహిళా కార్మికులకి మద్దతుగా 95 శాతం మంది పురుష కార్మికుల్లో సంఘీభావ చైతన్యం కలిగించడం ఎంతటి ఇబ్బందులతో కూడిందో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు. ఇదో పూర్వరంగ పరిస్థితి!


   పై క్రమంలో మహిళా బదిలీ కార్మికులకి (నాన్ పర్మినెంట్ వర్కర్లు)  యాజమాన్యం కుంటి సాకులతో ఉద్యోగాల నుండి తొలగించింది. వారి సంఖ్య సుమారు వందమంది ఉంటారు. వారికి పని కల్పించాలని 1986 చివరి నెలలలో నిరసన ఆందోళన ఉదృతంగా సాగింది. దానికి మెజార్టీ పురుష కార్మికుల నుండి మద్దతు లభించడంతో జూట్ యాజమాన్యం, వారి అనుకూల సంఘాలు కంగుతున్నాయి. పై స్థితిని మింగలేని జూట్ యాజమాన్యం సంక్రాంతి ముందు 19-12-1986వ తేదీ మధ్యాహ్నం 2 గంటల షిఫ్ట్ నుండి హఠాత్తుగా మిల్లు లాకౌట్ చేసింది. క్షణాల్లో ఇఫ్టూ నాయకత్వం స్పందించి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అనూహ్యంగా కార్మికవర్గం ప్రతిఘటనకి దిగింది. డ్యూటీలోని బి షిఫ్టు కార్మికులు మిల్లు లోపలే ఉండి పోయారు. పోలీసు బెదిరించినా బయటకు రాలేదు. ఎవరి మిషన్ల వద్ద వారే కూర్చుండి పోయారు. మరోవైపు డ్యూటీకి వచ్చిన A షిఫ్ట్ కార్మికులు మిల్లు గేటు బయట బైఠాయింపుకి దిగారు. సాయంత్రం కల్లా రాత్రి షిఫ్ట్ కార్మికులతో పాటు గృహిణులైన కార్మిక కుటుంబాల స్త్రీలు అధిక సంఖ్యలో మిల్లు వద్ద బైఠాయింపులో చేరారు. అటు మిల్లు లోపల, ఇటు బయటా ఓ శ్రామిక జన సముద్రంగా మారింది. పోలీసు లాఠీ తూటాల పహారాలోనే 24 గంటల ఉద్రిక్త భరితంగా కొనసాగింది. ఏ క్షణంలో కాల్పులు జరిపి చెదర గొడతారో తెలియని సందిగ్ద స్థితిలో ఆ రాత్రి గడిచింది. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యంతో మరునాడే లాకౌట్ ఎత్తివేత జరిగింది. ఇలా 24 గంటల్లోనే లాకౌట్ ని కార్మికవర్గం ఎత్తివేయించు కోవడం దేశ పారిశ్రామిక చరిత్రలోనే సంచలన సంఘటనగా ఓ స్థానిక దినపత్రిక వ్యాఖ్యానం చేసింది. యాజమాన్యం ఒకటి తలిస్తే, మరొకటి జరిగింది. శ్రామికవర్గం చేతుల్లో అది ఘోరంగా భంగపడింది. ఎట్టకేలకు మహిళా కార్మికుల కోర్కె ఫలించింది. 8 గంటల పనిదినం అమలైనది.  


    ఒకవైపు మహిళా కార్మికులకు 8 గంటల పని దినాన్ని ఒక హక్కుగా అమలు చేస్తూ, మరోవైపు వారిపై పొమ్మనలేక పొగ పెట్టినట్లు వేధింపులు, సాధింపులు, బాధింపులకి యాజమాన్యం దిగింది. వాటికి వ్యతిరేకంగా దశాలవారీ ఆందోళనల్లో భాగంగా ఒకగంట టోకెన్ సమ్మెకు యూనియన్ పిలుపు ఇచ్చింది. 1986 ఫిబ్రవరిలో శివరాత్రికి ముందు పై పిలుపు అమలు జరిగింది. దాన్ని కుంటిసాకుగా తీసుకొని ఒకగంట సమ్మెకు 8 గంటల జీతం కోతకు  యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అది కూడా సరిగ్గా శివరాత్రి జీతం బట్వాడాలో కోతకు దిగింది. ఏలూరు జూట్ మిల్ పేమెంట్ పద్దతి 15 రోజులకు ఒకసారి జీతం చెల్లింపు జరుగుతుంది. ఆ 15 రోజుల్లో 12 లేదా 13 రోజులే పని చేస్తారు. పనిచేసిన 8 రోజులకు జీతం కోత విధిస్తే, చేతిలో పండక్కి మిగిలేది లేదు.


  మరోవైపు యూనియన్ పిలుపు ప్రకారం తాము గంట టోకెన్ సమ్మె చేయడం పొరపాటని వ్యక్తిగత క్షమాపణ పత్రాల్ని రాసిన వారికి జీతం కోత ఉండదని యాజమాన్యం నోటీసు వేసింది. వాటిని రాయించే బిజినెస్ లో అనుకూల సంఘాలు మునిగాయి. ఆ స్థితిలో కార్మికవర్గాన్ని ఇఫ్టూ చైతన్య పరిచింది. టోకెన్ సమ్మెలో పాల్గొన్న ఒక్క కార్మికుడు కూడా క్షమాపణ పత్రం రాయక పోవడం విశేషం! 


  పేమెంట్ కి ఇక రెండే రెండు రోజుల వ్యవధి ఉంది. తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠత నెలకొంది. సరిగ్గా ఆ సమయంలో బుడుమూరు నాగేశ్వర రావు తాను పని చేసే సాఫ్టింగ్ డిపార్ట్మెంట్ కార్మికుల్ని వెంటబెట్టుకొని పర్సనల్ మేనేజర్ రూమ్ కి వెళ్లి ధైర్యంగా నిలదీసి ఇలా అన్నాడు.

 

 *మేము చెమట ఒడిపి పని చేసిన కాలానికి మీరు చెల్లించాల్సిన జీతాల్ని ఎగ్గొట్టి మీరు బాగుపడతారా? మా కార్మికుల నోళ్లు కొట్టి  ఇంకా సంపాదిస్తారా? మా నోళ్లు కొట్టాలని ఉంటే, మీ లాభాలు చాలవని అనుకుంటే, మా చేతి గడియారాల్ని తీసుకొని అమ్ముకొండి. (చేతి గడియారం తీసి పర్సనల్ మేనేజర్ ఎదుటనున్న బల్లమీద నాగేశ్వరరావు విసిరి కొట్టాడు) మా జీతాల్ని కోతవిధిస్తే సహించేది లేదు. మేం పని చేసిన కాలానికి జీతాలు పొందడం మా జన్మహక్కు!* 


  నిజానికి బుడుమూరు నాగేశ్వరరావు ఆనాటికి పర్మినెంట్ వర్కర్ కాదు.  బదిలీ కార్మికుడే! ఆనాటికి పర్మినెంట్ కార్మికులు సైతం మేనేజర్ ఛాంబర్ కి వెళ్లాలంటే భయపడే స్థితి వుండేది. అట్టి స్థితిలో పై నిలదీత సాహసోపేత సంఘటన అవుతుంది. 


  ఆరోజు బుడుమూరు నాగేశ్వరరావు చొరవతో జరిగిన పై సాహసోపేత సంఘటన క్షణాల్లో దవానలంలా యావత్తు మిల్లు కార్మికవర్గంలో ప్రచారమైనది. అదొక ప్రభంజనంగా మారింది. ఎట్టకేలకు యాజమాన్యం తలవంచక తప్పలేదు. ఆనాడు జీతం కోత లేకుండా జీతాలు తీసుకోవడం పెద్ద కార్మిక విజయం! ఆ విజయంలో ఆనాడు బుడుమూరు నాగేశ్వరరావు పోషించిన పాత్ర ఉత్ప్రేరకంగా ఉపకరించింది. అదే నాగేశ్వరరావు నిన్న సాయంత్రం ఏలూరులో మృతి చెందాడు. 


  శ్రీకాకుళం జిల్లాకి చెందిన నాగేశ్వరరావు జూట్ మిల్ ఉద్యోగం కోసం ఏలూరు వచ్చాడు. ఆయన వయస్సు 61 ఏళ్ళు! భార్య, ఒక కొడుకు, ఒక కూతురు వున్నారు. ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు ఆర్మీ లో పని చేసాడు. నిన్న రాత్రి జమ్మూ నుండి ఫ్లయిట్ లో బయలు దేరాడు. ఈ మధ్యాహ్నం ఏలూరు చేరతాడు. గత కొంత కాలంగా పక్షవాతం తో అనారోగ్యంగా వున్నాడు. ఆయన చిన్న తమ్ముడు శ్రీనివాస్ ఇప్పుడు ఏలూరు జూట్ కార్మికుడిగా పనిచేస్తూ ఇఫ్టూ అనుబంధ జూట్ మజ్దూర్ యూనియన్ కి నాయకత్వ పాత్రను పోషిస్తున్నాడు. 


   17-4-2022వ తేదీన మాజీ జూట్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు దోర సాంబశివరావు గారు మరణించారు. 48 గంటలు తిరక్కుండానే అదే యూనియన్ కి ప్రస్తుత సహాయ కార్యదర్శి బుడుమూరు నాగేశ్వరరావు మృతి చెందాడు. ఆయనకు జోహార్లు చెబుదాం. 


     పై ఇద్దరికి నివాళి అర్పించడంలో ఏలూరు ఇఫ్టూ నాయకత్వం పూర్తిగా లీనమైనది. ఏలూరు ఉద్యమంతో పొలారి, నేను దీర్ఘకాలిక అనుబంధం కలిగి ఉన్నాము. మేమిద్దరం విజయవాడలో వారం రోజులుగా అంగన్వాడీ రాష్ట్ర ఆవిర్భావ సభల నిర్వాహణ పనుల్లో వున్నాం. ఐనా మాకు ఆ ఉద్యమంతో గల సజీవ ఆత్మీయ అనుబంధం వల్ల 17న వెళ్లాం. తిరిగి నిన్న 19న వెళ్లాం. మాకు రాష్ట్ర బాధ్యతలు ఉండటం వల్ల ఈరోజు అంత్యక్రియలకి హాజరయ్యే అవకాశం లేక పోయింది. అందుకే పొలారి, నేను నిన్న రాత్రికి రాత్రే ఏలూరు వెళ్లి నివాళి  అర్పించి వచ్చాము. 


    చరిత్ర గమనంలో ఆయా ఉద్యమ చరిత్రల్ని నిశితంగా పరిశీలిస్తే, కొన్ని మలుపులు ఉంటాయని అర్ధమౌతుంది. కొన్నిసార్లు మూలమలుపు రాళ్లు (CORNER STONES) ఉంటే, మరికొన్నిసార్లు మైలు రాళ్లు (MILE STONES) ఉంటాయి. ఆ నిర్దిష్ట దశకు ముందూ, వెనకా వాటి పాత్రలు ఎలా వున్నా, ఒక ప్రత్యేక దశలో పోషించే పాత్రలు ఉద్యమ గమనాన్ని ఒక కుదుపుకు గురిచేస్తాయి. బుడుమూరు నాగేశ్వర రావు 35 ఏళ్ల క్రితం పోషించిన కీలక పాత్ర అలాంటిదే! ఆయన మరణించిన సందర్భంగా ఆయన నాడు పోషించిన పాత్రను జ్ఞాపకం చేసుకొని నివాళి అర్పిద్దాం. అట్టి మలుపు రాళ్లును, మైలు రాళ్లను సృష్టించే అవసరాన్ని గుర్తించి, అందుకు తగు కర్తవ్య దీక్ష వహిద్దాం.


  -ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

  20-4-2022,

9, మార్చి 2022, బుధవారం

చించెట్టు కింద టిఫిన్, ఏమిటి దాని వశీకరణ శక్తి ?

 




-భూమ‌న్‌

స్ట్రీట్ ఫుడ్ ఎక్క‌డెక్క‌డ దాగుందో క‌నిపెట్ట‌డం నాకు ఒక ఇష్ట‌మైన వ్యాప‌కం.
అందు కోసం ఎంత దూర‌మైనా ఫ‌ర‌వాలేదు, పోయి ఆర‌గించి రావ‌ల్సిందే.

ఎంత‌యినా చెప్పండి మ‌నిషికి ఆహారం చాలా చాలా ముఖ్యం క‌దా! ఆహార‌మే మ‌న ఆరోగ్య హేతుకు.
తిరుప‌తికి 30 కిలోమీట‌ర్ల దూరంలో, ముంబ‌యి, చెన్నై ప్ర‌ధాన ర‌హ‌దారిలో మామండూరులో ఈ టిఫిన్ సెంట‌ర్ ఉంది.

మ్యాపులో మామండూరు

మామండూరు గురించి  మరింత చదవండి ఇక్కడ



 

మామండూరు అంటేనే ప్ర‌కృతి బాట‌.

చుట్టూ కొండ‌లు, అడ‌వుల మ‌ధ్యన‌ ప‌క్షులు, జంతువుల‌న్నీ నిద్ర లేచి, వాటి వాటి తావుల‌కు పోయినాక ఈ టిఫిన్‌సెంట‌ర్ తెరుచుకుంటుంది. గత రెండేళ్ళుగా నెల‌కొక‌సారి పోతున్నా, టేస్ట్ ప్ర‌తిసారీ కొత్తే.
ప‌ద‌హైదేళ్ళుగా పెంచ‌ల‌య్య‌, సుశీల‌మ్మ‌, వారి అబ్బాయి దీన్ని న‌డుపుతున్నారు.

ప్రొద్దున తెల‌తెల‌వార‌గా తెరిచిన కొట్టు 11 గంట‌ల‌కంతా ముగుస్తుంది.
ఎంత సంతృప్తిగా ఆ లెక్క‌తో బ‌తుకుతున్నార్రా అనిపిస్తుంది.
క‌ష్ట‌ప‌డితే ఫ‌లితం అంటామే, ఇదిగో ఇట్లాంటి వాళ్ళ‌ను చూసి నేర్చుకోవాలి.
మాక‌య్యే బిల్లు 50 రూపాయ‌లు దాట‌దు.

 

తొలి నుంచీ క‌ట్టెల పొయ్యిమీదే వంట‌లు

సాదా దోసె 10 రూపాయ‌లు, ఇడ్లీ 5, వ‌డ 5, గుడ్డు దోసె 25, కారం దోసె 15 రూపాయ‌లు మాత్ర‌మే.
చెనిగ్గింజ‌ల ఊరుబిండి, ఎర్ర‌కారం, సాంబారు ఉంటాయి.

అన్నీ నోట్లో వేసుకుంటే మృదువుగా క‌రిగిపోయేట‌ట్టు ఉంటాయి.
ముగ్గురూ ముగ్గురే ఎంతో సౌమ్యంగా, విసుగు లేకుండా, చేతుల‌కు విడుప‌నేది లేకుండా, క‌డుపాత్రంగా వ‌చ్చిన ప్ర‌తివారినీ సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే వీరి ధ్యేయంగా ఉంది.

ఆ 50 రూపాయ‌ల టిఫిన్ కోసం 50 కిలోమీట‌ర్లు పోయి వ‌స్తున్నారంటే మ‌మ్మ‌ల్ని ఆక‌ర్షిస్తున్న‌దేమిటి మీకు తెలియ‌డంలా?

మీరు ఒక మారు ట్రై చేయండి.
చిన్న చిన్న కొట్ల వాళ్ళ‌ను బ‌తికించండి.
చ‌క్క‌టి రుచిక‌ర‌మైన ఆల్పాహారాన్ని రుచి చూడండి.

 

(భూమన్,చరిత్ర పరిశోధకుడు, సామాజిక ఉద్యమకారుడు, అన్నింటికి మించి ప్రకృతి ప్రేమికుడు, తిరుపతి)

8, మార్చి 2022, మంగళవారం

భూమన్ చెబుతున్న‘అడవి కథ’

 



(భూమన్)

శేషాచలానికి కొన్నాళ్ళు సెలవు ప్రకటించి నల్లమల అడవికి పోవాలని చాలా కాలంగా అనుకుంటున్నా.  అడవి,  అదొక  విచిత్రం.  ఎన్ని జీవరాశులు?  ఎంత   వైవిధ్యం,  ఎన్నెన్ని  వింత వింత సొగసులు... అడవంటే నాకు తొలి నుంచి ఒక ప్రత్యేకాభిమానం. అడవి వైవిధ్యం నన్నెంతగానో ఆకర్షించింది. ఒక్కోచోటున ఒక్కోతీరున ప్రకృతి అబ్బుర పరుస్తూనే ఉంటుంది అడవి. ఇలాంటి అడవి ప్రకృతిలో ప్రయాణమంటే మనిషి తనలోనే తాను ప్రయాణించటమే. ఎన్నెన్ని అనుభూతులు,  ఎన్నెన్నో సత్యాలు ఈ అడవి తన ఇముడ్చుకుంది.  మనిషి పయనం అడవి  నుంచే మొదలయింది. అందుకే   తీర్థయాత్ర అనో, విహార రాత్రిఅనో,  ట్రెకింగ్ అనో మనిషి ఎపుడూ   మనిషి కాంక్షఎపుడూ అడవి వైపు మళ్లుతూ ఉంటుంది. ఇలాంటి అడవులు మాయమయితే... మనిషి మానసికంగా కూడా సంక్షోభంలో పడిపోతాడేమో అని భయం కలుగుతుంది.

నామట్టుకు నాకు అడవిలో అలసట తెలియదు, ఎన్ని కిలో మీటర్లు నడిచినా, ఎత్తైన కొండలెన్ని ఎక్కినా అలసి పోయిందెపుడు? కొన్ని సార్లు, ఒక  భారమయిన ట్రెక్ తర్వాత, మరుసటి రోజు పొద్దునే మరొ ట్రెక్ కోసం అడవుల్లోని పరిగెత్తిన సందర్బాలున్నాయి. అడవి అనే మాట ఎంత ఎనర్జీ ఇస్తుంది.

 

మా యాత్ర కూడ ఆ తెగన  మనిషి-అటవీ  అనుబంధ పర్యవసానమేనేమో... లేదంటే అడవిలోకి వెళ్లామనగానే ఎంతమంది యువకులు ఉబలాటంగా ముందుకొస్తున్నారో? ఇదిగో  ఈ ఫోటోయే సాక్ష్యం.

ఈ మారు యువ మిత్రులు వివేక్, చంద్ర శేఖర్ రెడ్డి పూనిక వల్ల నా అడవి  యాత్ర  శేషాచలం నుంచి నల్లమల వైపు మల్లింది.  వాళ్ళిద్దరిలో  తాము చూసింది, కన్నది,  కనుగొన్నది, అనుభూతించింది పదిమందికి తెలియజేయాలని ఉత్సుకత అబ్బురం. నిజానికి వాళ్ళిద్దరి పిలుపే మా యాత్ర. బిలం గుహలలో ఒక రోజండాలి.  అంత దూరం వస్తున్నాం కదా లంకమల జలపాతాలు చూడకుండా తిరుగురావడమెలా? అందువల్ల ముందు రోజే తిరుపతి మిత్రులను 13 మందిని పోగుజేసుకున్నాం.  మామండూరు ‘చింత చెట్టు టిఫిన్’  ఆస్వాదించి సిద్ధవటం కోట ఔన్నత్యపు ముచ్చట్లు మనసారా చెప్పుకుని,  నందిపల్లె ఇంట్లో రుచికరమైన రాగి ముద్ద, చెనిగ్గింజల ఊరిబిండి వివేక్ మనసంత ఇష్టంగా ఆరగించి, లంకమల అడవుల్లోకి  పయనమయినాము.

 

 
బిలం గుహలో అద్భుతం... ఏ మునిశ్వరుడిదీ శిరస్సు

 

 

లంకమల అడవులు అటు మా శేషాచలానికి నల్లమలకు వారధి లాంటివి. మా అడవుల మాదిరిగానే ఎక్కడ చూసినా ఎర్రచందనం. లంకమల రెండు జలపాతాల్లో మా తనివితీరా మునిగి, కొందరికే కనిపించిన ఎలుగుబంటి రాక, పోక ముచ్చటించుకుంటూ వెనుతిరిగినాము.

మరుసటి రోజున బిలం గుహ యాత్ర. దాదాపు 80 మంది గుంపయింది.  అంతా మల్లేపల్లెలో గుమికూడినాము. అంతకు మునుపే మా తిరుపతి బృందం బ్రహ్మంగారిమఠం, బ్రహ్మంసాగర్ చూసొచ్చినాము.

కాశి నాయన మండలంలోని నల్లమల అడవుల్లో సావి శెట్టిపల్లె- ఆకునారాయణ పల్లె మధ్యలో ప్రధాన రహదారి నుండి పడమటి దిశగా 10 కిలోమీటర్ల దూరం పోతే,  మునీశ్వరుని కోనలో ఈ బిలం గుహ ఉంటుంది. కొందరు ట్రాక్టర్లల్లో, కార్లల్లో, ద్విచక్ర వాహనాల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా దూసుకొచ్చారు.  దూదెమ్మ కోన, బుగ్గ భైరవ స్వామి క్షేత్రం మీదుగా ఆ ప్రాంతానికి చేరుకున్నాము.

అడవి గొప్పదనమేంటంటే...ప్రజలు అమాయకంగా అడవిని ఎపుడూ సొంతంచేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.  ఎంతకీకారణ్యమయినా సరే, కాలుమోపాడడంటే చాలు అక్కడొక దేవుడో దేవతో ప్రత్యక్ష మవుతాడు.

మాతో వచ్చిన అటవీ ఉద్యోగి ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పినాడు. వాళ్ల శిక్షణలో భాగంగా వీళ్ళని జంతువుల బోనుల్లో ఉంచి జంతువుల కదలికలను, వాటి మనస్తత్వాన్ని అధ్యయనం చేయమంటారట. ఇదేదో చాలా బాగుంది కదా. నల్లమల పులులు, ఇతర జంతువులు, పక్షులతో పాటు అక్కడి స్వాముల గురించి చాలానే వివరించినాడు.

 

కడప జిల్లా మఠాలకు, స్వాములకు, అవధూతలకు, సన్యాసులకు చాలా ప్రసిద్ధి. ఎక్కడా చూడు వీళ్ళ ప్రభావమే. మనిషిని ప్రకృతిని పూజించే పరాకాష్ట కడప జిల్లాలో బాగా గమనించవచ్చు. వారి నమ్మకాలు వారివి.

 

ఏ అడవిలోనయినా, కొండమీద నయినా తొలిసారి అనుకుని మీరు నానా కాష్టాలు పడి చేరకుంటే, మన కంటే మందు అక్కడికొచ్చిన సాధు, గోసాయో కనబడతాడు. ఈ గుహ దగ్గిర ఈ సాధువు కనిపించాడు. అంతేకాదు, ఇక్కడికి అపుడపుడు సాధులు వచ్చి పూజలు చేసేవారట.

 
అడవంతా అల్లికి జిగిబిగి, ఛేదించుకుంటూ పోవలసిందే...

ఇక్కడ మరొక విశేషం చప్పుకోవాలి.  బిలం గుహ వద్ద కొన్నేళ్లుగా  ఒక సాయిబు    శివున్ని కొలుస్తున్నాడు. ఇపుడాయన మాకు ఫారెస్ట్ గైడ్.  మాతో  పాటు వచ్చి గుహ గురించి పరిపరివిధాల వివరించి అంతా ముక్కున వేలేసుకునేలా చేశాడు.  సాయిబు అనుభవాలన్నీ అబ్బురాలే.

కొండ అంచున  మధ్యభాగం చీలి వడ్డాణం లాగా ఈ గుహ మొదలయ్యింది. ఇంతకు మునుపెన్నడూ ఇట్టాంటి దాన్ని చూడలేదు.  ఆ గుహ   చాలా చాాలా పెద్దది. Mammath cave, బెలుం గుహలు, అరకు గుహలు, మేఘాలయ గుహలు, చైనా గుహలు చూసినాను గాని ఇలాంటిది  చూడటం తొలిసారే.

అడవి కొద్ది సేపు విరామం

మేము 1986లో పోతిరెడ్డిపాడు పాదయాత్ర చేసినప్పుడు ఒక పొలంలో ఉండే బెలుం గుహలను చూసినాము. నేను, YSR దాదాపు పర్లాంగు దూరం పోయి వచ్చినాము. ఆ తరువాత ఎంత బాగా అభివృద్ధయిందో కళ్ళారా చూసినాను. ఈ బిలం గుహ కూడా అట్లు అభివృద్ధి కావాలని దీన్ని గురించి పది మందికీ దండోరా వేసి చాటిచెప్పాలని వివేక్, చంద్రశేఖర్ రెడ్డి ల తాపత్రయం ఎంత అర్థవంతమైందో తెలిసొచ్చింది.

గుహ గబ్బిలాల అభయారణ్యం.  మేము అడుగు పెట్టడంతో... ఎవరో  బయటిప్రాణి తమ కీకారణ్యంలోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయని  గబ్బిలాలు అనుకున్నాయా?  ఆ గబ్బిలాల  హోరు గొప్ప సంగీత ప్రవాహంలా అలముకుంది. పైన గబ్బిలాలు, మధ్య సంగీత హోరు. కింద , మోకాళ్ళ లోతు మట్టి, గబ్బిలాల పెంట. ఘాటైన్ కాలిన భాస్వరం,అమ్మోనియాల వాసన. అయినా సరే, లెక్క చేయకుండా,   దారి లేని దారిలో ఆ సాయిబు ఉత్సాహంగా వేస్తున్న అడుగుల శబ్దాల మధ్య చిట్ట చివరి దాకా పోయి వచ్చినాము.

ఆ గుహ మార్మికత, ఆ సాయిబు ఆధ్యాత్మిక సౌరభం వెలకట్టేటివి కావు.


 
వడ్డాణపు బాట
ప్రకృతిలోని ఆ కొండల మధ్యన ఈ బిలం గుహల ఔన్నత్యం గురించి వాటి కథా కమామీషు మిత్రుడు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి చాలా గొప్పగా వర్ణించి ఉన్నాడు.

మళ్లీ అది చెప్పటం కాదు గాని, ఈ బిలం గుహను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయవలసిన కర్తవ్యం మనందరిదీ. ఈ పేరున బిలం గుహే కాకుండా 15 కిలోమీటర్ల దారిపొడవునా అటవీ సౌందర్యాన్ని, నీటి సొగసుల్ని, పక్షుల కిలకిలారావాల్ని, రకరకాల చెట్టుల్ని, చేవల్ని, అదృష్టం దాపురిస్తే పెద్దపులి ఆనవాల్ని పసిగట్టవచ్చు.

అంతేకాకాకుండా, దగ్గరగా ఉండే బ్రహ్మంసాగర్ ను చూసి, శ్రీ రామ కృష్ణయ్య గారికి నమస్కరిస్తూ, కాలజ్ఞానపు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, దగ్గర్లోనే జ్యోతి క్షేత్రాన్ని దర్శిస్తూ ఒక గొప్ప పర్యాటక సర్క్యూట్ ను తయారు చేసుకోవచ్చు.

ఇంత గొప్ప కార్యానికి పూనిక వహించిన ప్రకృతి ప్రియులు, అటవీ సౌందర్యారాధకులు చంద్రశేఖర్ రెడ్డి ని (అరణ్య శేఖర్), వివేకానంద రెడ్డి (వివేక్ లంకమల) లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నల్లమల యాత్రకు సంసిద్ధులవ్వమని కోరుతున్నా..

(భూమన్, చరిత్ర పరిశోధకుడు, రచయిత, ప్రకృతి ప్రేమికుడు, ట్రెక్కర్)

లంక‌మ‌ల కొండ‌రాతి సితార‌పై జ‌ల స్వ‌రాలు

 TRAVEL

లంక‌మ‌ల కొండ‌రాతి సితార‌పై జ‌ల స్వ‌రాలు





లోయలోకి వెళ్లామా, ఎదురుగా ఒక మ‌హాద్భుత దృశ్యం ఆవిష్కృతం. ప‌చ్చ‌ని లోయ‌ను అన్ని వైపులా కొండ‌లు క‌మ్మేశాయి, బాహువుల్లో భ‌ద్రంగా దాచుకున్న‌ట్లు…

 

(రాఘ‌వ‌శ‌ర్మ‌*)

నిట్ట నిలువుగా ఎత్తైన‌ రాతి కొండ‌.
ఎర్ర‌టి కొండ కొస నుంచి జాలువారుతున్న‌ స‌న్న‌ని జ‌ల‌ధార.

కొండ అంచుల‌ రాతి సితార‌పై స్వ‌రాలు మీటుతోంది.
దాని సానువుల్లో కొలువుదీరిన‌ విశాల‌మైన లంక‌మ‌ల‌ గుండంలోకి జారిపోతూ, కూనిరాగాలు తీస్తోంది.

ఎదురుగా ఏటిలో నునుపుదేలిన‌ పెద్ద పెద్ద బండ రాళ్ళ‌లోంచి ముందుకు సాగిపోతోంది.
ఆ ప‌క్క‌నే కొండ పైన మ‌రో జ‌ల‌ధార‌.
కొండ పైనుంచి జాలువారుతూ ఎన్ని మెలిక‌లు తిరిగిందో!

ఎన్ని హొయ‌లు పోతోందో! ఎన్ని రాగాలు ప‌లుకుతోందో! ఎన్ని గారాలు పోతోందో!
అది కూడా లోతైన ప‌స‌ల గుండంలోకి జారిపోతోంది.

ఎత్తైన కొండ నుంచి, నునుపు దేలిన బండ రాళ్ళ‌పై నుంచి ముందుకు సాగిపోతోంది. లంక‌మ‌ల గుండం ముందున్న ఏటిలోకి సంగ‌మిస్తోంది.
క‌డ‌ప జిల్లా బ‌ద్వేలుకు స‌మీపంలోని లంక‌మ‌ల కొండ‌ల్లో కొలువుదీరిన ఒక మ‌హాద్భుత ప్ర‌కృతి సోయ‌గం.

న‌ల్ల‌మ‌ల కొండ‌ల్లోని బిలం గుహ‌ను సంద‌ర్శించాల‌ని తిరుప‌తి నుంచి బ‌య‌లు దేరినమేం, ముంద‌గా లంక‌మ‌ల కొండ‌ల‌ను ద‌ర్శించాం.

Lankamala
బోదబోడు వంక

గ‌త శ‌నివారం, మార్చి 6వ తేదీ మ‌ధ్యాహ్నం బ‌ద్వేలు స‌మీపంలో ఉన్న‌నందిప‌ల్లెకు చేరాం.
‘అర‌ణ్య‌వాసం’ సినిమా స్క్రీన్‌ప్లే, క‌థార‌చ‌యిత వివేక్ త‌న ఇంట్లో రాగి సంక‌టి, ఊరుబిండితో చ‌క్క‌ని ఆతిథ్య‌మిచ్చారు.

తిరుప‌తి నుంచి వ‌చ్చిన మా ప‌న్నెండు మందితోపాటు మ‌రికొంద‌రు చేరారు. నందిప‌ల్లె నుంచి లంక‌మ‌ల అడ‌వుల్లోకి 16 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం.
చుట్టూ ర‌క‌ర‌కాల‌ చెట్లు, మ‌ధ్య‌లో మ‌ట్టి రోడ్డు.
దుమ్ము రేపుకుంటూ మా వాహ‌నాలు ముందుకు సాగిపోతున్నాయి.

కొంత దూరాన కుడివైపున‌ బోద‌బోడు వంక‌.
ఏటువాలు కొండ పైనుంచి వ‌ర్ష‌పు నీళ్ళు ఈ ఏటిలోకి జారిన ఆన‌వాళ్ళు.

నీటి ప్ర‌వాహానికి కొట్టుకు వ‌చ్చిన గుండ్ర‌టి గుల‌క రాళ్ళ‌తో, బండ రాళ్ళ‌తో ఇప్పుడా వంక నిండి ఉంది.
ఈ బోద‌బోడు వంక అస‌లు రూపాన్ని వ‌ర్షాకాలంలో చూడాలి.

పెన్న‌కు ఈవ‌ల లంక‌మ‌ల కొండ‌లు, ఆవ‌ల న‌ల్ల‌మ‌ల కొండ‌లు.

Lankamala
లంకమల అడవిలోకి దారి

లంక‌మ‌లలో న‌ల్ల‌మ‌లంత‌ ద‌ట్టమైన‌ అడ‌వి లేక‌పోయినా, ఇవి వాటికంటే ఎత్తైన కొండ‌లు. ఎక్కువ‌గా పాచి ఉన్న చోటుకు పాచిబండ‌ల‌ని పేరొచ్చింది. అలాగే కొన్ని ప్రాంతాల‌కు రెడ్డి చాలు, తుర‌క‌ల స‌రి అంటూ పేర్లున్నాయి.ఆ పేర్ల వెనుక జ‌న వ్య‌వ‌హారంలో అనేక క‌థ‌లున్నాయి.

మ‌ద్దిమ‌డుగు అనే ఒక పెద్ద లోతైన ఏరు.
బ‌స్సుల రాక‌కోసం ఆ ఏటిని పూడ్చేశారు.
ముందుకు సాగుతున్న కొద్దీ ర‌క‌ర‌కాల చెట్ల‌తో ద‌ట్ట‌మైన‌ అడ‌వి.

చుట్టూ ఎత్తైన కొండ‌లు క‌మ్మేస్తున్నాయి.
శ‌తాబ్దాల నాటి మ‌రింత ఎత్తైన వృక్షాలు.

ఏటి ప్ర‌వాహానికి కొట్టుకొచ్చిన గుండ్ర‌టి గుల‌క‌రాళ్ళ‌తో, బండ రాళ్ళ‌తోనిండిన‌ ఏరు. ఎక్క‌డో దూరం నుంచి చెవుల‌కు తాకుతున్న‌ జ‌ల‌సంగీతం.
ముందుకు సాగుతున్నాం.

Lankamala
ఎత్తైన ఎర్రని రాతి కొండ నుంచి లంకమల గుండం లోకి జాలువారుతున్న జలపాతం

ఎదురుగా ఒక  మ‌హాద్భుత దృశ్యం.
ఒక ప‌చ్చ‌ని లోయ‌ను మూడువైపులా కొండ‌లు క‌మ్మేశాయి. త‌మ బాహువుల్లో భ‌ద్రంగా దాచుకున్న‌ట్టున్నాయి.
ఎత్తైన చెట్ల కొమ్మ‌లు ఆకాశాన్నిక‌ప్పేశాయి.
మోక‌రిల్లి బ‌త‌క‌డం చేత‌కాద‌న్నట్టు, ఎత్తైన ఎర్ర‌ని కొండ నిటారుగా నిల‌బ‌డింది.

ఆకాశాన్ని తాకాల‌ని చూస్తోంది.
కొండ కొస నుంచి స‌న్న‌ని జ‌ల‌ధార విశాల‌మైన లంక‌మ‌ల గుండంలోకి జారిపోతోంది.

గుండంలో అల‌ల చిరున‌వ్వులు క‌ద‌లాడుతున్నాయి.
మురిపెంగా ఉన్న గుండంలోకి మావాళ్ళంతా మున‌క‌లేశారు.
దాని అలల స‌వ్వ‌డులు పెరిగాయి.
ఎవ‌రి కోస‌మూ అది ఆగ‌డం లేదు.
గుల‌క‌రాళ్ళ నుంచి, బండ రాళ్ళ కింద నుంచి ఆ జ‌ల‌ధార సాగిపోతోంది. ఎంత చూసినా త‌నివి తీర‌దు.

Lankamala
పసల గుండానికి వెళుతున్న ఏటి దారి

లంక‌మ‌ల గుండం ముందు లంక‌మ‌ల్లేశ్వ‌రాల‌యం.
ప‌క్క‌నే కొండపైనున్న మ‌రో గుండాన్ని చీక‌టి ప‌డ‌క‌ముందే చూడాలి.

అక్క‌డి జ‌ల‌పాతాన్నీ ప‌ల‌క‌రించాలి.
ఆ అడ‌విలో కుడివైపున కొండ పైకి బ‌య‌లుదేరాం.
పై నుంచి వ‌స్తున్న ఏటి వెంట రాళ్ళ‌పైన న‌డుచుకుంటూ ముందుకు సాగాం.

ఏటి ప‌క్క‌న ర‌క‌ర‌కాల‌ చెట్లు, ఊయ‌ల‌లూగే తీగ‌లు.
శ‌తాబ్దాల నాటి వృక్షాల్లో ఉట్టిప‌డుతున్న‌ వార్ధ‌క్య‌పు సౌంద‌ర్యం.

Nallamala Lankamala
దారి పొడవునా తీగెల ఉయ్యాలలే…

ఆ ఏరు ఎన్ని మెలిక‌లు తిరిగిందో, అన్ని మెలిక‌లూ తిరుగుతూ ఎక్కాం. జ‌ల‌పాతానికి ద‌రి చేరుతున్నమ‌న్న‌సంకేతంగా దూరంగా జ‌ల‌సంగీతం.
ఎత్తైన కొండ పైన లోతైన ప‌స‌ల గుండం.
ఆ గుండాన్ని చుట్టుముట్టిన రాతి కొండ పైనుంచి ఏట‌వాలుగా దుముకుతున్న జ‌ల‌ధార‌.

అంచ‌లంచెలుగా రాతి కొండ పైనుంచి జాలువారుతూ, ప‌స‌ల‌ గుండంలోకి ప‌డిపోతోంది.

జ‌ల‌ధార‌కు అదే హోరు, నిత్యం అదే పోరు.
నీటి గుండం క‌నిపిస్తే చాలు దూకేయాల‌నిపిస్తుంది.
ఈదుకుంటూ, ఈదుకుంటూ జ‌ల‌పాతం కింద‌కు వెళ్ళాం.
త‌లంతా నీటి ముత్యాలు రాలాయి.

జ‌ల‌పాతం జాలువారే కొండ అంచుప‌ట్టుకుని పైకి పాకాం.
ఓహ్‌..ఈ జ‌ల‌పాతం ముందుకు ఏ ష‌వ‌ర్ ప‌నికొస్తుంది!?
ఎంతసేపైనా అలా ఉండిపోవాల‌నిపించింది.

Nallamala Lankamala
పసల గుండం లోకి పడుతున్న జలపాతం

కానీ, కాలం వెంటాడుతోంది.
చీక‌టి ప‌డ‌డితే రాళ్ళ‌లో దిగ‌డం క‌ష్టం.
చీక‌టి ప‌డ‌క‌ముందే కొండ‌దిగిపోవాలి.
భారంగా, అయిష్టంగా గుండం నుంచి బైటికొచ్చాం.

మ‌రొక్క‌సారి ఆ జ‌ల‌పాతాన్ని వీక్షించి, ప‌స‌ల‌గుండాన్ని ప‌రిప‌రివిధాలా చూసి వెనుతిరిగాం. కొండ పైనుంచి కింద‌కుజాలువారుతున్న ఏటి వెంటే న‌డుచుకుంటూ కింద‌కు దిగేశాం.

కొండ ఎక్కుతున్న‌ప్పుడు చూసినదాని అందాల‌న్నిటిన దిగుతున్న‌ప్పుడూ చూశాం. ఆ అందాల‌ను, అనుభూతుల‌ను మ‌న‌సులో భ్ర‌ద‌ర‌ప‌రుచుకున్నాం.
తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యాం.

ఆ రాత్రికి అడ‌విలోనే నిద్రించాల‌ని సిద్ద‌మై వ‌చ్చాం.
శివ‌రాత్రి కి వ‌చ్చిన భ‌క్తులు పోతూ పోతూ కాలుష్యాన్నివ‌దిలి వెళ్ళారు.

ఇష్టం లేక‌పోయినా తిరుగు ప్ర‌యాణం కాక‌త‌ప్ప‌లేదు.
లంక‌మ‌ల గుండాన్ని, ఆ జ‌ల‌పాతాన్ని మ‌రొక‌సారివీక్షించాం. చీక‌టిప‌డ‌బోతోంది. భారంగా లంక‌మ‌లకు వీడ్కోలు ప‌లికాం.

 

 

Aluru Raghava Sarma

(*ఆలూరు రాఘవ శర్మ, రచయిత, ట్రెక్కర్, జర్నలిస్ట్, తిరుపతి

7, మార్చి 2022, సోమవారం

దోశని ఎపుడూ ఫోల్డ్ చేసే అందిస్తారెందుకు?

 

(జింకా  నాగరాజు)
దోశ, దోశె, దోసె ఎలా పలికినా దోశ సౌతిండియా బ్రేక్ ఫాస్ట్ సిగ్నేచర్.
చాలా మంది సౌతిండియన్ల లాగానే నాకు దోశంటే ఇష్టం. దోశంటే నాలుక్కోసుకుంటాను. ఇడ్లీ, వడ్ల, వూతప్పం, పూరి, పొంగల్ అన్నా ఇష్టమేకాని,ఉన్నమాట చెబుతున్నాను, నా మొదటి చాయస్ ఎపుడూ దోసే.
దోసే లాగించాకా కత ముగియదు కాబటి, ఢిల్లీ ఆంధ్రాభవన్  లో దోసే మీద మరొక దోసే లాగించిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఆ పైనే మిగతావి చూసుకుంటాను. ట్రంపు  ‘అమెరికా ఫస్టు’ లాగా మనం దోశ ఫస్టు.
 కాలేజీ  రోజుల్లో దోశాభిమానులతో ఒక గ్రూప్ కట్టింది బాగా గుర్తుంది. తిరుపతి యూనివర్శిటీ రోజు లో ఏ బజాార్లో ఏ హోటల్లో, ఏ బండి మీద దోశ బాగుంటుందో మా గ్రూపు ప్రయోగాలు చేసింది.
త్రిభుజాకారపు బట్టర్ దోసె (credit: wikimedia commons)[
ఏ వూరెళ్లినా ఆ వూర్లో మాంచి దోసె ఎక్కడ దొరకుతుందని కనుక్కోవడమేకాదు, అక్కడ దోసే ఎందుకు బాగుంటుందో రీసెర్చ్ చేయడం అలవాటు. ఆ సాయంకాలం దోశ సంగతులన్నీ కతకతలుగా చెప్పుకునేవాళ్లం హాస్టల్ పక్కన నడిరోడ్డు మీద తిష్టవేసి. దోశ మీద కథొకటి రాసి ఆ రోజుల్లో ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికకు పంపిస్తే టపీ మని తిరిగొచ్చింది. మన దోశవాళ్లకి నచ్చపోతే, మనమేం చేస్తాం.
 రేణిగుంట రైల్వే స్టేషన్ బయట... అదొక దోసె మహాప్రపంచం. స్టేషన్  చుట్టూర రాత్రంత దోశ లేస్తారని తెలిసి ఒక సారి ‘మిడ్ నైట్ దోసె’ తినాలనుకుని వెళ్ళిన రోజు నాకు బాగా గుర్తుంది. నాకు ఎగ్ దోశ పరిచయమయింది కూడా అక్కడే.
దోశ ఒక్కటే, చేసే విధానం ఒక్కటే, వూరును బట్టి దోసె రుచి మారుతుందని, టైం బట్టి రుచి మారుతుందని, అంతే కాదు, ఆకలిని బట్టి కూడా దోశ రూచి మారుతుందని నేను కనుక్కున్నది రేణిగుంటలోనే.
ఎందుకలా జరుగుతుందన్న ఆకలి కెమిస్ట్రీ  ఇప్పటికీ కనిపెట్టలేక పోయాను. కాలాన్ని బట్టి కూడా దోశ రుచి మారుతూంటుందని నా అనుమానం. ఇది కాలమహిమయా,  కాలన్ని బట్టి మారిన జిహ్వ చాపల్యమా నాకు తెలియదు.
పాతికేళ్ల కిందటి దోశ రుచి ఇపుడు ఎక్కడా కనిపించడం లేదు, నమ్మండి. పూర్వం అనంతపురం శ్రీకంఠం టాకీసులో ఒక క్యాంటీన్ ఉండింది. అది రోడ్డు మీదకు కూడా తెర్చుకుంటుంది. పక్కనే ఉన్న ఆర్టీసి డిపో ఉద్యోగులు దీనికి పేట్రాన్స్. ఒక రోజు అనుకోకుండా నేనూ దూరాను హోటల్లోకి టిఫిన్ చేద్దామని. ఇక్కడేం బాగుంటుందో చెప్పండని  అడిగాను. దోశ తీసుకోండన్నాడు, ప్రొప్రయిటర్ కమ్ సర్వర్. ఆయన మాట మీద నమ్మకంతో దోశ తిన్నాను. అదుర్స్. నాకు జీవితంలో అలాంటి కారపు, పప్పుల పొడి దోశ, వాళ్లిచ్చిన ఒక కప్పు సాంబారు మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఇపుడా దోశయే కాదు, సినిమా టాకీసూ మాయమైంది.  దాంతో టే హోటలూ పోయింది.  ఈ కాలం దోశకు పాత కాలపు రుచేందుకు లేదు?
దీనిక్కారణం, ఇపుడు దినుసులన్నీ పొల్యూటెడ్ అంటారు ఎన్వి రాన్ మెంటలిస్టొకాయన. అందుకే పాత రుచులెలా ఉంటాయని ఎదురుప్రశ్నవేశాడు.
ఢిల్లీ లో సాగర్ రత్న దోసె, కన్నాట్ ఫ్లేస్ శరవణ భవన్ దోసె, కరోల్ బాగ్ సదరన్ ట్రావెల్స్  దోసె... ఒకే వూర్లోనే ఉన్నా పోలికే ఉండదు. అలాగే శరవణ భవన్ వాళ్ల దోశ ఢిల్లీలో ఒక లాగుంటుంది, చెన్నై లో మరొకలాగుంటుంది. హైదరాబాద్ లో అబిడ్స్ తాజ్ మహల్ దోశ రుచివేరు, నారాయణ గూడ తాజ్ మహల్ దోశ రుచి వేరు.
దేని రుచి  దానిదే. మద్రాసు దోసెకు, బెంగుళూరు దోసెకు, విజయ వాడ దోసెకు, హైదరాబాద్ దోసెకు... అంతే. దేనికవే విజ్ఞాన సర్వస్వాలు.
నా మట్టుకు నాకు కర్నూల్ కల్కూర హోటల్లో( ఇపుడు లేదు) ఉడిపి దోశ నా నాలుక మీద చెరగని ముద్రవేసింది.
దోశ  పెనం మీద వేసినపుడు అడుగున  దోరగా,  కాలిన తర్వాత వచ్చే లేత కాపర్ కలర్  నన్ను కట్టిపడేసింది.   దోశకిలా బానిసయ్యేందుకు ఆ లేత వేపుడు రంగే కారణం. హంగుల్లాగానే రంగులు మనల్ని లొంగదీసుకుంటూంటాయి.
రచిగా శుచిగా దోశ చేయడం ఒక కళ. అయితే, దోశ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చాలా కోపం వస్తుంది. దోశ పెనం మీద వేశా కొద్దిగా కాలాక  పైన , ఎర్రకారం పట్టించి, అపైన కారప్పొడి చల్లి మసాల పులిమి ప్రేమతో  అందించే సాంప్రదాయిక దోసే నాకు ఇష్టం. ... తీసి విసిరి ప్లేట్లో పడేసే వాళ్లంటే నాకు చిరాకు.
దోసెని పసిపిల్లల్లాగా జాగ్రత్త సుకుమారంగా, ఎక్స్ ట్రా  మడత పడకుండా, చిట్లకుండా పేట్లో వేసిన వాడే నిజమయిన దోశ భక్తుడు.
అడ్డమయిన వాళ్ల చేతిలో దోశ అణగి మణగి ఉండదు. పెన్నానికి అతుక్కుపోయి వాళ్లని సతాయిస్తుంది. వాళ్లు పెన్నానికి దిష్టితీసి నానా ఆగచాట్లు పడినా  గుండ్రటి దోశ రాదు.
ఇలా జరగుకూడదని, దోశ తమని పదికాలాలు చల్లగా చూడాలని మొదటి దోశను ‘దోశ మహాతల్లి’కి అంకితమిచ్చాకే, కస్టమర్లకు దోశ వేస్తుంటారు చాలా హోటల్స్ లో. ఇదొక ఉత్తమ సంప్రదాయం.
దోశ చేయడం లాగే దోశని ఫోల్డ్ చేయడం గొప్ప కళ. అది చాలా నిష్ట ఉంటేనే వస్తుంది. ఫోల్డ్ చేయడం గురించి ఒక దోశరహస్యం తెలిసిన జ్ఞాని ఒకరు చెప్పేదాకా నాకూ తెలియదు.
దోశని సగానికి ఫోల్డ్ చేయవచ్చు. గోపురం లాగా ఎత్తుగా కోన్ షేప్ లో శంఖాకారంలో ఫోల్డ్ చేయవచ్చు. లేదా గుండ్రంగా అందంగా రోల్ చేయవచ్చు. బటర్ దోశలాగా త్రిభుజకారాంలో కూడా ఫోల్డ్ చేయవచ్చు.
శంఖాకారపు దోశ (credit: wikimedia commons)
ఫోల్డ్ చేయకుండా దోశ వడ్డించడం మంచిది కాదని ఆ పెద్దాయన  హెచ్చరించాడు. దాని వెనక ఫిజిక్స్ ఉందని ఆయన సాన్నిహిత్యంలోనే అర్థమయింది.
ఫోల్డ్ చేయకుండా దోసె ను వడ్డించే వాళ్లకి దోశ జ్ఞానం సగమే (half knowledge) ఉందని అర్థంట. ఎందుకంటే, దోశ పెన్నం  మీద నుంచి తీసేటపుటికి టెంపరేచర్ పీక్ లో ఉంటుందిట. అపుడు దోసెని అలా ఫోల్డ్ చేయకుండా గుండ్రటి చందమామలాగా వడ్డిస్తే ఆ వేడంతా డిఫ్యూజ్ అయి గాల్లోకి పోయి దోశలో  ‘లాస్ట్ మినిట్  కెమిస్ట్రీ’ పూర్తికాక   రుచి దెబ్బ తింటుందట.
అందుకే దోసెని  ఫోల్డ్ చేయాలి. అపుడేమవుతుంది?
అలా ఫోల్డ్ చేసి మూసేసినపుడు, లోపల దోశపొరల మధ్య ఉన్న స్టఫ్, ఆ మసాలా, కారం పొడి, కారం చట్నీ,/ఉల్లి పాయముక్కలు/ లేదా మరొకటి  కావచ్చు, కొద్ది సేపు కుతకుత సిమ్మర్ అయిపోయి దోశ డెలిషస్ గా మారుతుందని  దోసె  మాస్టర్ వివరించినపుడు ఔరా అనుకున్నా. అందుకే దోశ చివరి నిమిషం వేడిలో అలా సిమ్మర్ కావాలి.
అంతవరకు బాగుంది. అయితే,  సాదా దోసే తినే వాళ్లని చిన్నచూపుచూడ్డం, వాళ్లు రసికులు కాదేమోనని శంకించడం నాకు నచ్చలేదు.  నాకు దోశజ్ఞానం బోధించిన పెద్ద మనిషికి  సాదా దోసే తినేవాళ్ల మీద సదభిప్రాయం లేదు. ఎందుకంటే, లాస్ట్ మినిట్ కెమిస్ట్రీకి అందులో స్టఫ్ లేదుగా. అంతమాత్రాన సాదా దోశ తినేవాళ్లని చిన్నచూపుచూడ్డం నాకు నచ్చలేదు.
ఎందుకంటే మన దోశాభిమానుల మధ్య అలాంటి డిస్క్రిమినేషన్ ఉండరాదు.
ఎవరిష్టం వాళ్లది. సాదా దోసె తినేవాళ్ల దొక క్యాస్ట్, మసాల దోసెవాళ్లది మరొక క్యాస్ట్ అని దోసె ప్రపంచంలో క్యాస్టిజం తీసుకురావడం నాకునచ్చలేదు.
అందుకే దోసె మాస్టర్ కి కచ్చితంగా ‘అది మంచిది  కాద’ని చెప్పి వచ్చేశాను. మళ్లీ ఆ పక్కకు పోలే.
ఎందుకంటే, బెంగూళూరు ట్రినిటి సర్కిల్ లో ఒక పెద్ద దోసె బండి ఉంది. ఆ ప్రాంతంలో అదొక్కటే కిటకిటలాడుతూ ఉండే బండి. అక్కడ సాదా దోసే చాలా ఫేమస్. అలా తెల్లటి పర్ ఫొరేెటెడ్ దొసే చూస్తూనే నోరూరుతూ ఉంటుంది.  దానిని చక్కగా సగానికి ఫోల్డించి ప్లేట్లోని అరిటాకు మీద నాజూకుగా దించి. అంతే తెల్లటి కొబ్బరి చట్నీ వేసి, సాంబార్ , జింజర్ చట్నీ కప్స్ ని అందగా ప్లేట్లు మీద అమర్చి ఇచ్చినపుడు సాదా దోసే ధ్రిల్లే వేరు అనిపించింది.
ఇది చూశాక  సాదా దోశాభిమానులకూ ఒక సెంటిమెంట్ ఉంటుందని వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే హక్కు మనకు లేదని నిర్ణయించుకున్నా.
ఇన్నేళ్లు గడిచింది,  ఇప్పటికీ నా దోశాభిమానం తగ్గలేదు. కారం దోసె,  మసాల దోసె, ఆనియన్ దోసె, సాదా దోసే, ఎగ్ దోసే, దోసె బొంబాయ్ చట్నీ, రవ దోసే, ఇటీవలే పాపులర్ అవుతున్న మిల్లెట్ (కడప జిల్లాలో మాచిన్నపుడే తిన్నాం), కీమా దోశ, రొయ్యల దోశ,ఉప్మా దోశ, పాలక్ దోశ, రాజ్మా దోశ, ఏ వేరియాంట్ లో ఉన్నా సరే దోశే ఫస్ట్ అని ప్రకటించేందుకు ఏ మాత్రం వెనకాడను.
మా దోసెల్లోకి ఈ మధ్య వచ్చిన చేరిన కాంబినేషన్ చాక్ లెట్ దోశ. మిలీనియల్ అమ్మాయిలు అబ్బాయిలు  తెగ ఇష్టపడుతూ చాక్ లేట్ దోశ తినడం నేను  హైదరాబాద్ లో చూశాను.
అమెరికాలో మనవడు పుట్టాడని మిత్రులందరిని ఆ మధ్య మాజీ ఎంపి ఒకాయన సరదాగా కొంతమంది పాత మిత్రులను భోజనానికి పిల్చాడు. వాళ్లయింట్లో ఉన్నవంటవాడు పాండిచ్ఛేరి కుర్రవాడు.
వంటల్లో చాకు భరోసావాడు. అందుకని అతగాడి వంటలను రుచి చూపించేందుకు దోసే విశ్వరూపం ప్రదర్శించారు. ఇంటి ఆవరణలో శామియాన పందిరేసి దోసె పొయిపెట్టించి అన్ని నాన్ వెజ్ కూరలతో ఆ మధ్యాహ్నం అలా దోసె భీభత్సం సృష్టించారు. అన్నింటిలోకి టాప్ దోశ రొయ్యల వేపుడు.
ఇలా చెప్పుకుంటూ పోతే, అంతే ఉండదు. చివరిగా ఒక మాట చెబుతాను,  రాయలసీమలో దోశ క్రెసెంట్ (Dosa Crescent) గమనించాను.అనంతపురం దగ్గిర మొదలయ్యి తాడిపత్రి, జమ్మలమడుగు, ప్రొద్దుట్టూరు, మైదుకూరు, కడప దాకా అర్ధచంద్రాకారంలో కనబపడుతుందీ దోశ ఏరియా. ఈ మార్గంలో దోశ ఎంతపాపులర్ అంటే ప్రతి వూర్లో ప్రతి సందులో, రోడ్డు పక్కనో పుట్ పాతో మీదనో  ఒక ముసవల్ల పొద్దునా, సాయంకాలం దోశలు వేస్తూ నాలుగు రూకలు సంపాదించడం గమనించాను. ఇది హోటల్ కాదు, బండికాదు. ఇంటి ముందు కూర్చుని పొయ్యొక్కటి పెట్టుకుని దోశలు వేయడమే. దోశ తప్ప ఇంకేమీ దొరకవక్కడ. సింపుల్, సాదా దోశలు మాత్రమే వేస్తారు. దోశలు ఇలా ఎన్ని వందల కుటుంబాలను ఆదుకుంటున్నాయో అనిపించింది.
ఈ  పూటకిది చాలు, మరొక విడత మళ్లీ కలవ్వ చ్చు. అసలు విషయమేమిటంటే .. ఈ రోజు ఎవరో సోషల్ మీడియాలో దొశ  వొకాబులరీ షేర్ చేస్తున్నారు.
దానిని నలుగురితో  పంచుకోవాలన్నతాపత్రయంతో దోశాంతర యాత్ర చేయాల్సి వచ్చింది. క్షమించండి. అన్నట్లు దోసె, దోశెకి,దోసకి పెద్ద తేడాలేదు. ఎవరైనా ఎలాగయిన అడగవచ్చు. తిన వచ్చు, రాయవచ్చు, చదవ్వొచ్చు, పలకవచ్చు. అచ్చుతప్పునుకునేరు సుమా.

కొసమెరుపు

ఇక్కడొ విషయం చెప్పుకోవాలి. దోసే ఇపుడ గ్లోబలైజ్ అయింది.  ఆ మధ్య చిన్న పనిమీద తమిళనాడు తిరువళ్లూరు వెళ్లాను. లోకల్ దోసె కోసం వెదుకుతున్నా. బస్టాడ్ సమీపంలో వీర రాఘవ పెరుమాల్ టెంపుల్ ఉంది. ఆపక్కనే పేద్ద కోనేరుంటుంది. అక్కడ రోడ్డు మలుపులో ఉన్న దోసె బండి  బోర్డు మీద నా కళ్లు పడ్డాయి. అక్కడ ‘దోజ్జా’(Dozza) అని ఇంగ్లీషులో బోర్డు మీద రాసి ఉంది. దోజ్జా చాలా బాగుందే ఈ మాట అనిపించింది. వెంటనే అటు వైపు  ఒరు దోజ్జా అనేశాను..  దోజ్జా అంటే  దోసె ప్లస్ పిజ్జా. వావ్   దోజ్జాని  అదరగొట్టాడు. ముప్ఫైరుపాయలు.  ఎలా చేశావని అడిగాను. ఆయన తమిళంలో క్లుప్తంగా చెప్పాడు. నాకేమి అర్థంకాలేదేగాని, దోజ్జా మాత్రం  మరుపురాని అనుభవం.
దోశె పారిభాషిక పదజాలం (సోర్స్ సోషల్ మీడియా)
1. దోశోహం – దోశెతప్ప వేరె అల్పాహారం మీద ఇష్టం లేకపోవటం
2. దోశెభక్తి – దోశె తింటున్నప్పుడు దాని మీదనే దృష్టిని కేంద్రీకరించే మానసిక పరిస్థితి
3. దోశాటన – దోశె దొరుకు హోటల్ కొరకు వెతికే ప్రయత్నము (విదేశీ పర్యటనలో)
4. దోశోధ్దారకులు – ఈనాటికీ, ఎంత పెద్ద నగరాలయినా వీధి చివర బండి పెట్టుకుని దోశెలు రుచికరంగా వేసి, పరుగుల జీవితానికి బ్రేక్ ఫాస్ట్ అందించేవారు
5. దోశ్వాఘతుకం – స్నేహితునికి దోశె పార్టి ఇస్తానని ఈయక పోవటం
6. దోశె నివృత్తి – ఉట్టి దోశె మీద ఉల్లి ముక్కలు జల్లి దానికి దిష్టితీయడం
7. దోశోదరులు – కొబ్బరి మరియు అల్లం-టమోట చట్నీలు
8. దోశెముదురు – ఏ దోశెలో ఎప్పటి పిండి వాడారో చెప్పగల్గిన వాడు
9. దోశావతారం – దొశ ప్లాజా లొ మెనులొ వాడె దోసెల పేర్లు
10. దోశామారుతం – ఆర్డరు ఇచ్చాక హోటలు కిచెన్ లోంచి మన నాసికను తాకు మన దోశె తాలుకు పరిమళం
11. దోశభూయిష్టం – సరిగ్గా మడతపెట్టని దోశ పరిస్ఠితి.
12. దోశా సారము – కాలుతున్న పెనములాంటి జీవితం ఎంత కష్టమయినా అది క్షణికమేనని గుర్తెరిగి, తనకు తగినవారితో (నూనె, వుల్లి, మసాలా లాంటి దోస్తులతో) సావాసం చేస్తు, కాలుతున్న బాధను తనలోనె దిగమింగుతూ, పరులకు రుచిని పంచిపెట్టుటకు నిత్యం పాటుపడు జీవితం ధన్యం.
ఇక్కడ మొదట అచ్చయింది.

న‌ల్ల‌మ‌ల‌లో ‘బిలం గుహ‌’కు ట్రెక్…


(రాఘ‌వ‌శ‌ర్మ‌)

ఒక చిన్న రాతి కొండ రాక్ష‌సిలా నోరు తెరుచుకుంది.

రుషుల జ‌టాజూటాల్లా దాని నెత్తిన వేలాడుతున్న‌చెట్ల ఊడ‌లు.

ఆ బిలంగుహ నోట్లోకి ప్ర‌వేశిస్తే అంతా చీక‌టే!

దాని గోడ‌ల‌కు త‌ల‌కిందుల వేలాడుతున్న గ‌బ్బిలాల గుంపు.

అలికిడి విన‌గానే ఎటుపోవాలో అంతుచిక్క‌క‌, ట‌ప‌ట‌పా మ‌ని రెక్క‌లు కొట్టుకుంటూ తిరుగాడాయి.

ఆ చీక‌ట్లో మౌన మునుల్లా ఉన్న రాళ్ళు!

నేలంతా ఎగుడు దిగుడుగా, గ‌బ్బిలాల రెట్ట‌ల‌తో మెత్త‌టి మ‌ట్టిలా త‌యారైంది.

 

 

Nallamala Bilam Guha బిలం గుహ కు బయలు దేరు తున్న ప్రకృతి ప్రియులు

న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో బిలంగుహ న‌క్కి ఉంది.

గుహను చూడ్డానికి ర‌మ్మ‌ని అక్క‌డి మిత్రులు పిలుపునిచ్చారు.

భూమ‌న్ అట‌వీ శాఖ అనుమ‌తులు తీసుకున్నారు.

అనేక ప్రాంతాల నుంచి వివిధ వృత్తుల వారు.

ఒక‌రా ఇద్ద‌రా! 75 మంది వ‌చ్చేశారు.

ఒక్క తిరుప‌తి నుంచే 12 మందిమి వెళ్ళాము.

క‌డ‌ప జిల్లాలో మైదుకూరు-పోరుమామిళ్ళ మ‌ధ్య ఉన్న‌ మ‌ల్లెప‌ల్లె నుంచి అడ‌విలోకి వెళ్ళాలి.

మార్చి 6వ తేదీ, ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు న‌ల్ల‌మ‌లలోకి ప్ర‌వేశించాం.

Nallamala Bilam Guha అడవిలో అల్లు కు పోయిన పొదలు

జీపుల్లో, ట్రాక్ట‌ర్ల‌లో, మోటారు సైకిళ్ళ‌లో ప్ర‌యాణం.

అంతా మ‌ట్టి రోడ్డు. ఇరు వైపులా చెట్లు.

మార్చి వ‌చ్చేసింది. వేస‌వి మొద‌ల‌వుతోంది.

ప‌చ్చ‌ని చెట్లు ఎండుముఖం ప‌ట్టాయి.

దారంతా మెలిక‌లు తిరిగి, దుమ్ము రేగుతోంది.

కిలోమీట‌రున్నర వెళ్ళ‌గానే దూదెమ్మ కోన వ‌చ్చేసింది.

కొండ‌ల్లోంచి వ‌స్తున్న ఏర్లు రోడ్డుకు అడ్డంగా ప్ర‌వ‌హిస్తున్నాయి.

అడ‌విలోకి ప్ర‌వేశిస్తున్న కొద్దీ ద‌ట్టంగా పెరిగిన‌ చెట్లు ప‌చ్చ‌ద‌నం సంత‌రించుకున్నాయి.

ఇరువైపులా వెదురు పొద‌లు అల్లుకుపోయాయి.

అడ‌విలో ఎన్ని రకాల తీగ‌లో!

లోనికి పోయిన కొద్దీ చెట్లు మ‌రింత ద‌ట్టంగా పెరిగి, ఆకాశాన్నిక‌మ్మేశాయి.

ప‌దిహేను కిలో మీట‌ర్లు ప్ర‌యాణించాక పురాత కాలం నాటి కోనేరు.
చుట్టూ రాతి క‌ట్ట‌డం. నీళ్ళు ఎంత స్వ‌చ్చంగా ఉన్నా యో!

ఈ నీళ్ళు తాగితే ఆక‌లివేస్తుందని ఇక్క‌డ ప్ర‌జ‌ల అనుభ‌వం.

Nallamala Bilam Guha పురాతన కాలం నాటి కోనేరు

అక్క‌డే ఆంకాళ‌మ్మ విగ్ర‌హం.

విస్త‌రాకుల కోసం వాడే మాడ‌పాక చెట్టు.

చుట్టూ చెట్ల‌తో కొండ‌పైకి స‌న్న‌ని న‌డ‌క‌దారి.

పావు గంట‌లో పైకి ఎక్క‌గ‌లిగాం.

యువ‌కుల్లో ఉత్సాహం, పెద్ద‌ల్లో ఆనందం.

ఎదురుగా రాతి కొండ‌.

Nallamala Bilam Guha కొండ ఎక్కె దారి

పొలుసులు పొలుసులుగా ఉన్న ఆ రాతి కొండ‌లో ఇనుప ఖ‌నిజం ఇమిడి ఉంది.

టీటీడీ అట‌వీ రేంజ‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య‌ ఈ విష‌యాన్ని గ‌మ‌నించారు.

ఇనుప ఖ‌నిజం గాలిలో క‌లిసి ర‌సాయ‌నిక చ‌ర్య జ‌ర‌గ‌డంతో కొండ అంచులు ప‌ల‌క‌లుగా ఏర్ప‌డింది.

ఒక్క సారిగా ఇంత మందిని చూసి బిలం గుహ నోరెళ్ళ‌బెట్టింది.

దాని నోరు అడ్డంగా చీలింది.

కింద పెద‌వి బిగ‌బ‌ట్టి, పై పెద‌వి తెరుచుకుంది.

గ్రామ‌స్తులు ఏర్పాటుచేసుకున్న చిన్న మెట్ల‌దారిలో లోప‌లికి ప్ర‌వేశించాం.

విశాలంగా చ‌దునైన ప్రాంతం అంతా యాగాలు చేసిన బూడిద నిండి ఉంది.

మ‌హాశివ‌భ‌క్తుడు మ‌హ‌బూబ్ బాషా పెద్ద బ్యాట‌రీ లైట్ వెలుగులో మ‌మ్మ‌ల్ని లోనికి తీసుకువెళుతున్నాడు.

శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో నినాదాలిస్తున్నాడు.

లోప‌లకు దిగుతున్న కొద్దీ అంతా చిమ్మ చీక‌టి.

Nallamala Bilam Guha గుహలో తొలి అంచెలో యాగాలు చేసిన ప్రాంతం

ఎన్ని మెలిక‌లో!

ఏట‌వాలుగా లోనికి దిగుతున్నాం.

అంతా బూడిద మ‌యం.

గుండ్ర‌టి బండ‌ల పైన గ‌బ్బిలాల రెట్ట‌లు.

అడుగు వేస్తుంటే దుమ్ము రేగుతోంది.

జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నాం.

ఏ మాత్రం త‌ప్ప‌ట‌డుగు ప‌డినా ప‌డిపోతాం.

ప‌ట్టుకోడానికి ప‌క్క‌నేమీ లేదు.

తాడుపైన న‌డుస్తూ స‌ర్క‌స్ చేస్తున్న‌ట్టు అడుగులు ప‌డుతున్నాయి.

మెత్త‌టి బూడిద క‌మ్మిన రాళ్ళ గుట్ట‌ల్లోంది దిగుతున్నాం.

ఆ రాళ్ళ‌లో ఎన్ని రూపాలో!

Nallamala Bilam Guha 
శిరస్సు రూపంలో ఉన్న శిల

ప‌ది అడుగుల శివ‌లింగాకార‌పు రాయి క‌నిపించింది.

క‌ళ్ళు , ముక్కు, నోరు వంటి రూపాల‌తో స‌హ‌జ‌సిద్దంగా ఏర్ప‌డిన శిర‌స్సు వంటి రూపం.

ఈ రాళ్ళ‌న్నీ గుహ‌లో త‌ప‌స్సు చేసుకుంటున్న‌ రుషుల‌ని ఇక్క‌డి భ‌క్తుల‌ విశ్వాసం.

ఇక్క‌డ అనేక మంది రుషులు మ‌న‌కు క‌నిపించ‌కుండా ఇప్ప‌టికీ త‌ప‌స్సు చేసుకుంటున్నార‌ని వారి న‌మ్మ‌కం.

లోప‌ల క‌నిపించే రాళ్ళ‌న్నీ రుషులేనంటారు.

అందుకే లోనికి చెప్పుల‌తో అనుమ‌తించ‌రు.

ఈ గుహ‌లో చెప్పులు లేకుండా న‌డ‌క చాలా ఇబ్బంది.

బూడిద‌లో ఉన్న స‌న్న‌ని రాళ్ళు కాళ్ళ‌లో గుచ్చుకుంటున్నాయి.

ఆ గుహ‌లో అలా ఎంత దూరం వెళ్ళామో మాకే తెలియ‌దు.

చిమ్మ చీక‌టి . బ్యాట‌రీ వెలుగులో ముందుకు సాగుతున్నాం.

Nallamala Bilam Guna గుహలో చిమ్మ చీకటి

దిగుడు అయిపోయింది. ఎదురుగా ఎక్కాలి.

కొంత ఎక్కాక ఎదురుగా మ‌రొక బిలం.

ఆ బిలంలోకి ప్ర‌వేశించ‌డం సాధ్యం కాదు.

ఆ ప్రాంతానికి చెందిన కొంద‌రు మాత్ర‌మే ఆ సాహ‌సం చేయ‌గ‌లిగారు.

లోప‌ల ఒక చ‌దునైన ప్రాంతం ఉంద‌ట.

అప్ప‌టికే చెమ‌ట‌లతో బ‌ట్ట‌ల‌న్నీ త‌డిసిపోయాయి.

గ‌బ్బిలాలు వేసిన రెట్ట‌ల వాస‌న‌.

బిలం గుహ‌లో ప‌డిన గ‌బ్బిలాల రెట్ట‌లు ఎరువుగా ఉప‌య‌గ‌పడుతోంది.

రైతులు బ‌స్తాల‌లో నింపుకుని తీసుకు వెళ‌తారు.

అయినా త‌ర‌గ‌ని గ‌ని.

పైకెక్క‌డం మొద‌లు పెట్టాం.

దిగ‌డం ఎంత క‌ష్ట‌మో ఎక్క‌డం మ‌రింత క‌ష్టం.

లోప‌ల ఆక్సీజ‌న్ స‌రిగా అంద‌డం లేదు.

బిలం గుహ బైటికి వ‌చ్చి గ‌ట్టిగా ఊపిరి పీల్చుకున్నాం.

Nallamala Bilam Guha బిలం గుహ పైన రాళ్ళలో మొలిచిన చెట్టు నుంచి వేలాడు తున్న వూడలు[

గుహ ముందు రాళ్ళ‌పైన కూర్చుని సేద‌దీరాం.
రాయ‌ల‌సీమ‌లో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ స‌న్న‌పురెడ్డి వెంక్ర‌టామిరెడ్డి తొలిసారిగా మూడు ద‌శాబ్ద‌ల క్రితం ఈ బిలం గురించి రాసే వ‌ర‌కు బైట ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియ‌దు.

వ‌చ్చిన‌వారంద‌రికీ కోనేరు వ‌ద్దే వంట‌లు చేశారు.

కొండ దిగాక అడ‌విలో భోజ‌నం చేసి సాయంత్రం తిరుగుప్ర‌యాణ‌మ‌య్యాం.

బిలం గుహ ఒక అపురూపం.ఈ అపురూపాన్ని ప‌దుగురికీ పంచాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌ల ఉత్సాహం.Aluru Raghava Sarma 

Aluru Raghava Sarma

(ఆలూరు రాఘవశర్మ, రచయిత, ట్రెకర్, జర్నలిస్టు, తిరుపతి)


మరిన్ని ఆసక్తికరమయిన  విశేషాలకోసం trendingtelugunews.com సందర్శించండి.



17, అక్టోబర్ 2015, శనివారం



Sleight of hand of  former hero Murali Mohan ?





-Jinka  Nagaraju


When every inch of farmers' land has been taken to build Amaravti capital, I wonder as to how the the lands of hero of yester years and realtor-turned-MP Murlimohan escpaed government's land acquisition  or land pooling. We have not read any news that he had offered his lands to the government voluntarily under land pooling schemes. One can argue that he land doesn't fall in the CRDA  area. This is exactly my question and the suspicion many leaders that the CRDA was so developed that lands of big fish are spared from the borders of CRDA. When Muralimohan purchased these lands? Did CRDA exclude the village where our Rajamahendravarm MP purchased lands?  People will know the answers in due course.

As of now, Murali Mohan is going to reap  early bird  advantages of real estate business in Amaravati areaa. The State Environment Impact Assessment Authoirty (SEIAA) has granted environmental clarance for  1.27 lakh sq.m built-up area project at Kunchanapalli in capital area. The SEIAA  approved the recommendations of State Environmental Appraisal Committee with regards to the MP's Jayabheri Properties venture of residential plots in Kunchanapalli of Tadepalli mandal Guntur district. Tadepalli is the in heart of capital region. The project is coming up in 2.775 ha. The village is very close to AP capital area.