*ఏలూరు జూట్ కార్మికోద్యమంలో 35 ఏళ్ల క్రితం ఓ అపురూప పాత్ర పోషించిన బుడుమూరు నాగేశ్వరరావు మృతి*
*కార్మికోద్యమాల్ని కీలక మలుపులు తిప్పే ఘటనల పరిశీలనకు ఆయనో ఉదాహరణ!
మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. శ్రమ జీవులే చరిత్ర సృష్టిస్తారు. ఇవి నిప్పులాంటి నిజాలే! కార్మికోద్యమాల నుండి యోధులు పుట్టుకొస్తారు. ముఖ్యంగా కొన్ని కీలక సంఘటనలకు కొందరు కారకులై స్ఫూర్తిదాతలు గా, ప్రేరణగా నిలుస్తారు. అలాంటి నిర్దిష్ట ఉజ్వల సంఘటనకు ముందూ, వెనకా ఆ నిర్దిష్ట వ్యక్తులు సామాన్యులుగానే వుంటారు. వారే కొన్ని వేళల్లో అసామాన్యుల పాత్రల్ని పోషిస్తుంటారు. తాత్కాలికంగా వారు అసమాన్య పాత్ర పోషించి ఉద్యమ గమనానికి ఒక నిర్దిష్ట దశలో తోపుడు శక్తిగా కూడా నిలుస్తారు. ఏలూరు జూట్ కార్మికోద్యమ గమనంలో 35 ఏళ్ల క్రితం అలాంటి ఓ తోపుడు శక్తి పాత్రను బుడుమూరు నాగేశ్వర రావు పోషించాడు. తాను ఏలూరులో నిన్న మృతి చెందాడు. ఆయన నాడు పోషించిన ఆ పాత్రని గుర్తు చేసుకోవడానికి సముచిత సందర్భమిది.
ఫ్లాష్ బ్యాక్
అది 1986 మే ఒకటి! నూరవ మే దినోత్సవం రోజు! ఇఫ్టూ బహిరంగ సభ! ఏలూరు జూట్ మిల్ లో పురుష కార్మికులకు 8 గంటల పనిదినం, కానీ మహిళా కార్మికులకు 12 గంటల పనిదినం అమలు జరిగేది. నాటి సభ 8 గంటల పనిదినం కై మేడే పోరాటం జరిగి నూరేళ్ళకి కూడా ఈ అన్యాయం ఏమిటని ప్రశ్నించింది. పైగా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గల ఏలూరులో ఇదేమి దురన్యాయమని ఆనాటి సభలో ప్రశ్నించిన వాణి జూట్ మిల్ మహిళా కార్మికుల హృదయాల్ని తాకింది. అంతవరకూ అణచబడి ఒదిగివున్న మహిళ కార్మికుల్లో కొత్త చైతన్యం తలెత్తింది. అదో దీర్ఘకాలిక సజీవ ఉద్యమ రూపం ధరించింది. అదో పూర్వరంగ నేపధ్యం!
180 మంది మహిళా కార్మికుల కోసం 5000 మంది పురుష కార్మికుల్ని సంఘీభావంగా సమీకరణ చేయాల్సిన బాధ్యత ఇఫ్టూ సంఘంపై పడింది. అది చాలా క్లిష్టమైనది. పైగా సున్నితమైనది కూడా! పిడికెడు మంది ఆడవాళ్ళ కోసం ఐదు వేల మంది మగవర్కర్లని రోడ్డు పాలు చేస్తున్నారనే నిందా ప్రచారానికి జూట్ యాజమాన్యం & వారి అనుకూల సంఘాలు పాల్పడ్డాయి. మహిళల్ని అవహేళన చేసే భాషలో దుష్ప్రచారం సాగించడం గమనార్హం! ఆడవారికి వ్యతిరేకంగా పురుష కార్మికుల్లో పురుష దురహంకారాన్ని రెచ్చగొట్టే ప్రచారమది. ఆ సున్నిత పరిస్థితుల్లో ఐదు శాతం మంది మహిళా కార్మికులకి మద్దతుగా 95 శాతం మంది పురుష కార్మికుల్లో సంఘీభావ చైతన్యం కలిగించడం ఎంతటి ఇబ్బందులతో కూడిందో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు. ఇదో పూర్వరంగ పరిస్థితి!
పై క్రమంలో మహిళా బదిలీ కార్మికులకి (నాన్ పర్మినెంట్ వర్కర్లు) యాజమాన్యం కుంటి సాకులతో ఉద్యోగాల నుండి తొలగించింది. వారి సంఖ్య సుమారు వందమంది ఉంటారు. వారికి పని కల్పించాలని 1986 చివరి నెలలలో నిరసన ఆందోళన ఉదృతంగా సాగింది. దానికి మెజార్టీ పురుష కార్మికుల నుండి మద్దతు లభించడంతో జూట్ యాజమాన్యం, వారి అనుకూల సంఘాలు కంగుతున్నాయి. పై స్థితిని మింగలేని జూట్ యాజమాన్యం సంక్రాంతి ముందు 19-12-1986వ తేదీ మధ్యాహ్నం 2 గంటల షిఫ్ట్ నుండి హఠాత్తుగా మిల్లు లాకౌట్ చేసింది. క్షణాల్లో ఇఫ్టూ నాయకత్వం స్పందించి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అనూహ్యంగా కార్మికవర్గం ప్రతిఘటనకి దిగింది. డ్యూటీలోని బి షిఫ్టు కార్మికులు మిల్లు లోపలే ఉండి పోయారు. పోలీసు బెదిరించినా బయటకు రాలేదు. ఎవరి మిషన్ల వద్ద వారే కూర్చుండి పోయారు. మరోవైపు డ్యూటీకి వచ్చిన A షిఫ్ట్ కార్మికులు మిల్లు గేటు బయట బైఠాయింపుకి దిగారు. సాయంత్రం కల్లా రాత్రి షిఫ్ట్ కార్మికులతో పాటు గృహిణులైన కార్మిక కుటుంబాల స్త్రీలు అధిక సంఖ్యలో మిల్లు వద్ద బైఠాయింపులో చేరారు. అటు మిల్లు లోపల, ఇటు బయటా ఓ శ్రామిక జన సముద్రంగా మారింది. పోలీసు లాఠీ తూటాల పహారాలోనే 24 గంటల ఉద్రిక్త భరితంగా కొనసాగింది. ఏ క్షణంలో కాల్పులు జరిపి చెదర గొడతారో తెలియని సందిగ్ద స్థితిలో ఆ రాత్రి గడిచింది. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యంతో మరునాడే లాకౌట్ ఎత్తివేత జరిగింది. ఇలా 24 గంటల్లోనే లాకౌట్ ని కార్మికవర్గం ఎత్తివేయించు కోవడం దేశ పారిశ్రామిక చరిత్రలోనే సంచలన సంఘటనగా ఓ స్థానిక దినపత్రిక వ్యాఖ్యానం చేసింది. యాజమాన్యం ఒకటి తలిస్తే, మరొకటి జరిగింది. శ్రామికవర్గం చేతుల్లో అది ఘోరంగా భంగపడింది. ఎట్టకేలకు మహిళా కార్మికుల కోర్కె ఫలించింది. 8 గంటల పనిదినం అమలైనది.
ఒకవైపు మహిళా కార్మికులకు 8 గంటల పని దినాన్ని ఒక హక్కుగా అమలు చేస్తూ, మరోవైపు వారిపై పొమ్మనలేక పొగ పెట్టినట్లు వేధింపులు, సాధింపులు, బాధింపులకి యాజమాన్యం దిగింది. వాటికి వ్యతిరేకంగా దశాలవారీ ఆందోళనల్లో భాగంగా ఒకగంట టోకెన్ సమ్మెకు యూనియన్ పిలుపు ఇచ్చింది. 1986 ఫిబ్రవరిలో శివరాత్రికి ముందు పై పిలుపు అమలు జరిగింది. దాన్ని కుంటిసాకుగా తీసుకొని ఒకగంట సమ్మెకు 8 గంటల జీతం కోతకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అది కూడా సరిగ్గా శివరాత్రి జీతం బట్వాడాలో కోతకు దిగింది. ఏలూరు జూట్ మిల్ పేమెంట్ పద్దతి 15 రోజులకు ఒకసారి జీతం చెల్లింపు జరుగుతుంది. ఆ 15 రోజుల్లో 12 లేదా 13 రోజులే పని చేస్తారు. పనిచేసిన 8 రోజులకు జీతం కోత విధిస్తే, చేతిలో పండక్కి మిగిలేది లేదు.
మరోవైపు యూనియన్ పిలుపు ప్రకారం తాము గంట టోకెన్ సమ్మె చేయడం పొరపాటని వ్యక్తిగత క్షమాపణ పత్రాల్ని రాసిన వారికి జీతం కోత ఉండదని యాజమాన్యం నోటీసు వేసింది. వాటిని రాయించే బిజినెస్ లో అనుకూల సంఘాలు మునిగాయి. ఆ స్థితిలో కార్మికవర్గాన్ని ఇఫ్టూ చైతన్య పరిచింది. టోకెన్ సమ్మెలో పాల్గొన్న ఒక్క కార్మికుడు కూడా క్షమాపణ పత్రం రాయక పోవడం విశేషం!
పేమెంట్ కి ఇక రెండే రెండు రోజుల వ్యవధి ఉంది. తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠత నెలకొంది. సరిగ్గా ఆ సమయంలో బుడుమూరు నాగేశ్వర రావు తాను పని చేసే సాఫ్టింగ్ డిపార్ట్మెంట్ కార్మికుల్ని వెంటబెట్టుకొని పర్సనల్ మేనేజర్ రూమ్ కి వెళ్లి ధైర్యంగా నిలదీసి ఇలా అన్నాడు.
*మేము చెమట ఒడిపి పని చేసిన కాలానికి మీరు చెల్లించాల్సిన జీతాల్ని ఎగ్గొట్టి మీరు బాగుపడతారా? మా కార్మికుల నోళ్లు కొట్టి ఇంకా సంపాదిస్తారా? మా నోళ్లు కొట్టాలని ఉంటే, మీ లాభాలు చాలవని అనుకుంటే, మా చేతి గడియారాల్ని తీసుకొని అమ్ముకొండి. (చేతి గడియారం తీసి పర్సనల్ మేనేజర్ ఎదుటనున్న బల్లమీద నాగేశ్వరరావు విసిరి కొట్టాడు) మా జీతాల్ని కోతవిధిస్తే సహించేది లేదు. మేం పని చేసిన కాలానికి జీతాలు పొందడం మా జన్మహక్కు!*
నిజానికి బుడుమూరు నాగేశ్వరరావు ఆనాటికి పర్మినెంట్ వర్కర్ కాదు. బదిలీ కార్మికుడే! ఆనాటికి పర్మినెంట్ కార్మికులు సైతం మేనేజర్ ఛాంబర్ కి వెళ్లాలంటే భయపడే స్థితి వుండేది. అట్టి స్థితిలో పై నిలదీత సాహసోపేత సంఘటన అవుతుంది.
ఆరోజు బుడుమూరు నాగేశ్వరరావు చొరవతో జరిగిన పై సాహసోపేత సంఘటన క్షణాల్లో దవానలంలా యావత్తు మిల్లు కార్మికవర్గంలో ప్రచారమైనది. అదొక ప్రభంజనంగా మారింది. ఎట్టకేలకు యాజమాన్యం తలవంచక తప్పలేదు. ఆనాడు జీతం కోత లేకుండా జీతాలు తీసుకోవడం పెద్ద కార్మిక విజయం! ఆ విజయంలో ఆనాడు బుడుమూరు నాగేశ్వరరావు పోషించిన పాత్ర ఉత్ప్రేరకంగా ఉపకరించింది. అదే నాగేశ్వరరావు నిన్న సాయంత్రం ఏలూరులో మృతి చెందాడు.
శ్రీకాకుళం జిల్లాకి చెందిన నాగేశ్వరరావు జూట్ మిల్ ఉద్యోగం కోసం ఏలూరు వచ్చాడు. ఆయన వయస్సు 61 ఏళ్ళు! భార్య, ఒక కొడుకు, ఒక కూతురు వున్నారు. ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు ఆర్మీ లో పని చేసాడు. నిన్న రాత్రి జమ్మూ నుండి ఫ్లయిట్ లో బయలు దేరాడు. ఈ మధ్యాహ్నం ఏలూరు చేరతాడు. గత కొంత కాలంగా పక్షవాతం తో అనారోగ్యంగా వున్నాడు. ఆయన చిన్న తమ్ముడు శ్రీనివాస్ ఇప్పుడు ఏలూరు జూట్ కార్మికుడిగా పనిచేస్తూ ఇఫ్టూ అనుబంధ జూట్ మజ్దూర్ యూనియన్ కి నాయకత్వ పాత్రను పోషిస్తున్నాడు.
17-4-2022వ తేదీన మాజీ జూట్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు దోర సాంబశివరావు గారు మరణించారు. 48 గంటలు తిరక్కుండానే అదే యూనియన్ కి ప్రస్తుత సహాయ కార్యదర్శి బుడుమూరు నాగేశ్వరరావు మృతి చెందాడు. ఆయనకు జోహార్లు చెబుదాం.
పై ఇద్దరికి నివాళి అర్పించడంలో ఏలూరు ఇఫ్టూ నాయకత్వం పూర్తిగా లీనమైనది. ఏలూరు ఉద్యమంతో పొలారి, నేను దీర్ఘకాలిక అనుబంధం కలిగి ఉన్నాము. మేమిద్దరం విజయవాడలో వారం రోజులుగా అంగన్వాడీ రాష్ట్ర ఆవిర్భావ సభల నిర్వాహణ పనుల్లో వున్నాం. ఐనా మాకు ఆ ఉద్యమంతో గల సజీవ ఆత్మీయ అనుబంధం వల్ల 17న వెళ్లాం. తిరిగి నిన్న 19న వెళ్లాం. మాకు రాష్ట్ర బాధ్యతలు ఉండటం వల్ల ఈరోజు అంత్యక్రియలకి హాజరయ్యే అవకాశం లేక పోయింది. అందుకే పొలారి, నేను నిన్న రాత్రికి రాత్రే ఏలూరు వెళ్లి నివాళి అర్పించి వచ్చాము.
చరిత్ర గమనంలో ఆయా ఉద్యమ చరిత్రల్ని నిశితంగా పరిశీలిస్తే, కొన్ని మలుపులు ఉంటాయని అర్ధమౌతుంది. కొన్నిసార్లు మూలమలుపు రాళ్లు (CORNER STONES) ఉంటే, మరికొన్నిసార్లు మైలు రాళ్లు (MILE STONES) ఉంటాయి. ఆ నిర్దిష్ట దశకు ముందూ, వెనకా వాటి పాత్రలు ఎలా వున్నా, ఒక ప్రత్యేక దశలో పోషించే పాత్రలు ఉద్యమ గమనాన్ని ఒక కుదుపుకు గురిచేస్తాయి. బుడుమూరు నాగేశ్వర రావు 35 ఏళ్ల క్రితం పోషించిన కీలక పాత్ర అలాంటిదే! ఆయన మరణించిన సందర్భంగా ఆయన నాడు పోషించిన పాత్రను జ్ఞాపకం చేసుకొని నివాళి అర్పిద్దాం. అట్టి మలుపు రాళ్లును, మైలు రాళ్లను సృష్టించే అవసరాన్ని గుర్తించి, అందుకు తగు కర్తవ్య దీక్ష వహిద్దాం.
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
20-4-2022,
